తెలంగాణలో తారాస్థాయిలో బీజేపీ అగ్రనేతల ప్రచారం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 24 Nov 2023 8:55 AM ISTతెలంగాణలో తారాస్థాయిలో బీజేపీ అగ్రనేతల ప్రచారం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది. అధికారం కోసం ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే తారాస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన జాతీయ నాయకులు తెలంగాణకు క్యూ కడుతున్నారు. తమ పార్టీ తరఫు అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ అభివృద్ధి మంత్రంగా ప్రజల్లోకి వెళ్తోంది. అయితే.. బీజేపీ అగ్రనేతలు ఒకే రోజు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నెల 25న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌సా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
శుక్రవారం నుంచే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వరుసగా మూడ్రోజుల పాటు రాష్ట్రంలోనే పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్‌కు చేరుకుంటారు. బీజేపీ నిర్వహించనున్న ఆర్మూర్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్ పరిధిలో ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు శేరిలింగంపల్లి నియోజకవర్గం, సాయంత్రం 4.30 గంటలకు అంబర్‌పేట్ రోడ్‌షోల్లో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఆ తర్వాత రోజు 25వ తేదీ ఉదయం 11 గంటలకు కొల్లాపూర్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటలకు మునుగోడు, 2 గంటలకు పటాన్‌చెరు సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో అమిత్‌షా రోడ్‌షో నిర్వహిస్తారు. ఇక ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు మక్తల్, మధ్యాహ్నం ఒంటి గంటకు ములుగు, 3 గంలకు భువనగిరి సభల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు కూకట్‌పల్లి బహిరంగ సభలో పాల్గొని కేంద్రహోంమంత్రి అమిత్‌షా ప్రసంగిస్తారు.
ఇక ప్రధాన నరేంద్ర మోదీ ఈ నెల 25 నుంచి 27 వరకు వరుసగా మూడు రోజుల్లో ఆరు సభల్లో పాల్గొననున్నారు. 25న మహేశ్వరం, కామారెడ్డి, 26న తుఫ్రాన్, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్ సభలకు ఆయన హాజరుకానున్నారు. 27న సాయంత్రం ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకూ 40 కిలోమీటర్ల పొడవునా మోదీతో రోడ్ షో నిర్వహించేందుకు కూడా పార్టీ ప్లాన్ చేస్తున్నది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 25వ తేదీ మద్యాహ్నం 2 గంటలకు హుజూర్‌నగర్ బహిరంగ సభలో పాల్గొంటారు.ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గం, 6 గంటలకు ముషీరాబాద్ నియోజవకర్గంలో రోడ్‌షోల్లో పాల్గొనున్నారు జేపీ నడ్డా. శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి మేడ్చల్, కార్వాన్, కంటోన్మెంట్‌లలో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.