కుటుంబ పాలనకు అంతం పలకాలి: జేపీ నడ్డా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయని జేపీ నడ్డా అన్నారు.

By Srikanth Gundamalla  Published on  23 Nov 2023 4:18 PM IST
telangana, elections, bjp campaign, jp nadda ,

కుటుంబ పాలనకు అంతం పలకాలి: జేపీ నడ్డా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నాయకులు, అభ్యర్థులు జోరుగా పాల్గొంటున్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన బీజేపీ ప్రచారంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై.. ఇటు కాంగ్రెస్‌ పార్టీపైనా తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయని జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనీ.. లక్షల కోట్లు అక్రమంగా దోచుకున్నారంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్లలో అభివృద్ధి చెందింది ఎవరు అంటే.. కేవలం కేసీఆర్ కుటుంబమే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. దళితబంధులో ప్రజాప్రతినిధులు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. అంతేకాదు.. దళితబంధు అసలైన లబ్ధిదారులకు అందడం లేదని.. బీఆర్ఎస్‌ శ్రేణులకే అందుతోందని చెప్పారు జేపీ నడ్డా.

కుటుంబ పాలన వల్ల ఎప్పుడూ అభివృద్ధి జరగదు అని చెప్పారు జేపీ నడ్డా. తెలంగాణలో కూడా కుటుంబ పాలన వల్ల ఎలాంటి ప్రగతి లేదని చెప్పారు. తన కుటుంబాన్ని తప్ప ఎవరినీ పైకి తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, యూపీ, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో కుటుంబ పాలన సాగుతోందన్నారు. ఇది కుటుంబంతోనే కాదు.. దేశంలోని కుటుంబ వారసత్వ పాలకులపై పోరాటమని జేపీ నడ్డా అన్నారు. అయితే.. ఇప్పటికే బీజేపీ కుటుంబ పాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కలిగించిందని.. అలాగే కేసీఆర్‌ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలన్నారు.

తెలంగాణలో ఎక్కువగా మైనార్టీలు ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. అలాగే ధరని పోర్టల్‌ కేసీఆర్ ఆక్రమణలకు పోర్టల్‌గా మారిందని విమర్శించారు. డబుల్‌బెడ్రూం ఇళ్లు ఊహా లోకంలో కట్టారని అన్నారు జేపీ నడ్డా. అభివృద్ధిని చేసి చూపిస్తుంది మోదీ సర్కార్‌ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రకటించారని అన్నారు. రైతులకు మేలు జరుగుతోందన్నారు. ఇదిలానే కొనసాగాలంటే కేసీఆర్‌ను గద్దె దించాలనీ.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని జేపీ నడ్డా చెప్పారు.

Next Story