తెలంగాణలో బీజేపీ గెలిస్తే సీఎంగా బీసీ నేత: అమిత్‌షా

సూర్యాపేటలో బీజేపీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభలో బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on  27 Oct 2023 6:15 PM IST
telangana, elections, amit shah,  bjp cm, BC leader,

తెలంగాణలో బీజేపీ గెలిస్తే సీఎంగా బీసీ నేత: అమిత్‌షా

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ సందర్భంగా సూర్యాపేటలో బీజేపీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభలో బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. సభా వేదికగా బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణకు బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ చేసిందేమీ లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు. అయితే.. తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. ఇక సారి గెలిస్తే కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తారా అంటూ బీఆర్ఎస్‌కు చురకలంటించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అమిత్‌షా అన్నారు. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యమని అమిత్ షా ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను సీఎంను చేయాలని కేసీఆర్ ఆలోచిస్తూ వుంటారని, రాహుల్‌ను ప్రధానిగా చేయాలని సోనియా గాంధీ చూస్తుంటారని ఆయన విమర్శించారు. కేసీఆర్, సోనియాగాంధీ కుటుంబ సభ్యులకు పదవులు, సంక్షేమమే ముఖ్యమని అన్నారు. ప్రజల గురించి వారు ఎప్పుడూ పట్టించుకోరంటూ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తుందని చెప్పారు హోంమంత్రి అమిత్‌షా. బీఆర్ఎస్ పేదలు, దళితుల వ్యతిరేక పార్టీ అని ఆయన దుయ్యబట్టారు.

తెలంగాణలో కేసీఆర్‌ సీఎం అయ్యాక దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పారని.. ఆ హామీ ఏం చేశారంటూ ప్రశ్నించారు అమిత్‌సా. రూ.50వేల కోట్లతో దళితుల అభివృద్ధి నిధి ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.10వేల కోట్లతో బీసీల సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పారు ఇవన్నీ ఎటు పోయాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని హోంమంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ అని ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యాంగబద్దంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే బీజేపీ తెలంగాణలో గెలిస్తే బీసీ నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు.

Next Story