తెలంగాణ ఎన్నిలక గెజిట్ నోటిఫికేషన్ విడుదల.. 11 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
తెలంగాణ శాసన సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫారం-1 నోటీసును ఎన్నికల అధికారులు జారీ చేయనున్నారు.
By అంజి Published on 3 Nov 2023 10:42 AM IST
తెలంగాణ ఎన్నిలక గెజిట్ నోటిఫికేషన్ విడుదల.. 11 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
తెలంగాణ శాసన సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫారం-1 నోటీసును ఎన్నికల అధికారులు జారీ చేయనున్నారు. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ నవంబర్ 10. నవంబర్ 13వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి అవుతాయి.
అభ్యర్థులు తమ నానిమేషన్లను దాఖలు చేసేటప్పుడు తమ నేరాల చిట్టాను స్పష్టంగా పేర్కొన్నాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కొత్త నిబంధన తీసుకు వచ్చింది. నేరాల వివరాలను మూడు సార్లు ప్రముఖ వార్తా పత్రికల్లో యథాతథంగా ప్రచురించాలని పేర్కొంది. ఒకవేళ అభ్యర్థి జైలులో ఉంటే అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేసి, వారి ధ్రువీకరణతో పత్రాలు పంపాల్సి ఉంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 94 రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 2,644 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి.
ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాన్ని ప్రారంభించాయి. నేటి నుంచి 10వ తేదీ వరకు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో 3.17 కోట్ల మంది ఓటర్లు 119 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. ఇప్పటి వరకు 117 స్థానాలకు బీఆర్‌ఎస్, 100 స్థానాలకు కాంగ్రెస్, 88 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి.
అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో రిట్నరింగ్ అధికారుల కార్యాలయాల దగ్గర ఈసీ పలు ఆంక్షలు విధించింది. ఆఫీసుకు 100 మీటర్ల పరిధిలోకి 3 వాహనాలకు, ఆర్వో గదిలోకి అభ్యర్థి సహా ఐదుగరికి మాత్రమే అనుమతి ఇచ్చింది. విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర వివరాలతో అఫిడవిట్ సమర్పించడం తప్పనిసరి అని పేర్కొంది. ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ మస్ట్, ఆన్‌లైన్ నామినేషన్ వేస్తే ప్రింటెడ్ కాపీ ఆర్వోకు ఇవ్వాల్సి ఉంటుంది. 24 గంటల్లో అఫిడవిట్లను ఈసీ వెబ్‌సైట్‌లో ఉంచుతారు.