హైదరాబాద్: నాంపల్లి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదంపై వస్తున్న వార్తలను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కొట్టిపారేశారు. ఈ ప్రమాదంలో కీలకమైన కేసుల ఫైల్స్ కాలిపోయాయనేది పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. నాంపల్లి ఫోరెన్సిక్ FSL అగ్నిప్రమాదంపై విచారణ జరుగుతోందని శివధర్ రెడ్డి వెల్లడించారు. ఓటుకు నోటు కేసు ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవమని, ఆ కేసు ఫైల్స్‌ను 2021లోనే కోర్టుకు అందజేశామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రిపోర్టులూ ఇచ్చామన్నారు. హైప్రొఫైల్ కేసుల సాక్ష్యాధారాలు, డిజిటల్ ఫైల్స్ అన్నీ సురక్షితంగా ఉన్నాయని డీజీపీ వెల్లడించారు.
అగ్నిప్రమాదం కేవలం కంప్యూటర్ సెక్షన్ మరియు లైబ్రరీ ఉన్న ప్రదేశంలోనే జరిగిందని, సాక్ష్యాలు భద్రపరిచే స్టోర్ రూమ్‌లకు మంటలు వ్యాపించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కావాలని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.