పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ ఏమన్నారంటే..
ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉండవచ్చని పోలీసు సిబ్బంది ఆత్మహత్యలపై డీజీపీ వ్యాఖ్యానించారు.
By Medi Samrat
పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ ఏమన్నారంటే..
ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉండవచ్చని పోలీసు సిబ్బంది ఆత్మహత్యలపై డీజీపీ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలకు పని ఒత్తిడి కారణం కాదన్నారు. “ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, భావోద్వేగ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు వంటి అనేక సమస్యలు కారణమవచ్చు.. ఒక సమస్య వల్ల ఇలా జరుగుతుందని చెప్పలేం.. పని ఒత్తిడి వల్ల అని మనం సాధారణీకరించలేం.. పని ఒత్తిడికి సంబంధించిన కొన్ని సందర్భాలు కూడా ఉండవచ్చు.. నేను నో అనడం లేదు అని అన్నారు.
పోలీసు సిబ్బంది పని సంబంధిత సమస్యలను పరిష్కరించుకోడానికి అంతర్గత యంత్రాంగం ఉందని కూడా ఆయన తెలిపారు. డిపార్ట్‌మెంట్‌లో కుటుంబ, భావోద్వేగ, ఆర్థిక సమస్యలు ఉన్న ఉద్యోగులకు సలహా ఇచ్చే అధికారులు ఉన్నారు. ఈ విషయమై "డిపార్ట్‌మెంట్ స్థాయిలో సమస్యను పరిష్కరించలేకపోతే.. మేము ప్రొఫెషనల్ కౌన్సెలర్ల సహాయం తీసుకుంటాము," అని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై స్పందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ సర్వసన్నద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. తెలంగాణ పోలీసు అధికారుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డీజీపీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
2024 క్రైమ్ వార్షిక నివేదికను హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ జితేందర్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే 9.87 శాతం కేసులు పెరిగాయని డీజీపీ జితేందర్ తెలిపారు. గతేడాది 1,38,312 కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాది 1,69,477 కేసులు బుక్ అయ్యాయని వెల్లడించారు. సైబర్ నేరాలు 43.44 శాతం పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది 33,168 సైబర్ క్రైమ్ కేసులను నమోదు చేశామని తెలిపారు. 1525 కిడ్నాప్, 703 దొంగతనాలు, 58 దోపిడీలు, 856 హత్య, 2945 అత్యాచార కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. డయల్ 100కు 16,92,173 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1942 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 142.95 కోట్ల విలువ చేసే 20 టన్నుల డ్రగ్స్‌ను సీజ్ చేశామని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. 48 డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా సైబర్ నేరగాళ్ల నుంచి రూ.2.42 కోట్ల నగదును రికవరీ చేశామని.. ఈ ఏడాది 85 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని పేర్కొన్నారు.