ఫార్ములా ఈ-రేస్‌తో రాష్ట్రానికి ఉపయోగమేమీ లేదు: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఈ-రేసింగ్‌ను నిర్వాహకులు రద్దు చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 4:11 PM ISTఫార్ములా ఈ-రేస్‌తో రాష్ట్రానికి ఉపయోగమేమీ లేదు: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఈ-రేసింగ్‌ను నిర్వాహకులు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ చర్యల ద్వారా రాష్ట్రానికి నష్టం వాటిల్లితోందని.. ఈ-రేసింగ్‌ను రద్దు చేసుకోవడం సరైన నిర్ణయం కాదని కేటీఆర్ చెప్పారు. అయితే.. తాజాగా ఇదే విషయంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. ఫార్ములా ఈ-రేస్‌తో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. ఫార్ములా ఈ రేస్‌పై మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలకు మల్లు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఫార్ములా ఈ -రేస్ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. సెక్రటరియెట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఫార్ములా ఈ-రేస్‌కు అనుమతి లేదని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. వాళ్లెవరో హైదరాబాద్‌కు వచ్చి.. మళ్లీ వెళ్లడానికి రూ.100 కోట్లు కట్టాలా? అని ప్రశ్నించారు. ఇది బిజినెస్ రూల్స్‌కు భిన్నమైందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్రంలో ప్రతి పైసా ప్రజల అవసరాల కోసమే ఖర్చు చేస్తామని ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టిందంటూ ఆరోపణలు చేశారు. ఫార్ములా ఈ-రేస్‌పై మాజీ మంత్రులు అనవసరమైన మాటలు పేలుతున్నారంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఈ-రేస్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఫార్ములా-ఈ రేస్ వెనక్కి వెళ్లడంతో రాష్ట్రానికి జరిగే నష్టం ఏమీ లేదని మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఇందులో ఓ కంపెనీ టికెట్లు అమ్ముకుని లబ్ధి పొందిందనీ..ముగ్గురు వాటాదారులు ఉన్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.