తాత్కాలిక సంతోషం కోసం డ్రగ్స్‌కు బానిస కావొద్దు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతోంది.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 8:00 AM GMTతాత్కాలిక సంతోషం కోసం డ్రగ్స్‌కు బానిస కావొద్దు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతోంది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నుంచే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎక్కడా డ్రగ్స్ కనిపించొద్దనీ.. రవాణాను కట్టడి చేయాలని చెప్పారు. దీని కోసం అధికారులకు ప్రభుత్వం ఫుల్ రైట్స్‌ను ఇచ్చింది. అయితే.. తాజాగా డ్రగ్స్ రవాణా, వాడకంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. యువతకు పలు సూచనలు చేశారు.
అక్రమ సంపాదన కోసం కొందరు డ్రగ్స్ దందా రూట్‌ను ఎంచుకుంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. వారు కావాలనే పిల్లలు, యువతను టార్గెట్ చేసి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. యువత తాత్కాలికంగా సంతోషం కోసం డ్రగ్స్‌ను కొని.. వాడుతున్నారని చెప్పారు. ఇలా క్రమంగా డ్రగ్స్‌కు బానిస అవుతున్నారని పేర్కొన్నారు. కేవలం కాసేపటి సంతోషం కోసం డ్రగ్స్ కు బానిస అవ్వొద్దని యువతకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా, దాని వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు నిరింధించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. ఎన్ని నిధులైనా ఇందు కోసం కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న వారితో పాటు.. వినియోగిస్తున్న వారికి కూడా చట్టపరమైన శిక్షలు విధిస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ చెప్పారు.
రాష్ట్రాన్ని, రాష్ట్ర యువతను డ్రగ్స్ నుంచి కాపాడుకుందామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సంఘవిద్రోహ శక్తులకు యువత జీవితాలను బలికాకుండా చూసుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరోకు బడ్జెట్ ఎంతైనా ఇస్తామని చెప్పారు. అలాగే అన్ని గ్రామాల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలు వేసుకోవాలనీ.. కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.