రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణలో రైతుబంధు కోసం ఇంకా కొందరు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు
By Srikanth Gundamalla Published on 30 April 2024 3:44 PM IST
రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణలో రైతుబంధు కోసం ఇంకా కొందరు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొందరి అకౌంట్లలో నగదు జమ అయిపోయింది. మరికొందరి ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉండగానే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో.. అధికారులు రైతుబందు నిధుల విడుదలను ఆపేశారు. ఇక ఎన్నికల కోడ్ ఎత్తివేశాక డబ్బులు జమ చేస్తారా? లేదా అన్న సందేహం రైతుల్లో నెలకొంది.
ఈ క్రమంలోనే రైతులకు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. రైతులందరికీ పెట్టుబడి సాయం అందించేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది రైతులకు పంటపెట్టుబడి సాయం అందిచామన్నారు. మరో 5 లక్షల మందికి ఇవ్వాల్సి ఉందని అన్నారు. వారికి కూడా కచ్చితంగా అందజేస్తామనీ.. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత డబ్బులు జమ చేస్తామన్నారు. ఈ మేరకు రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మల్లు భట్టి విక్రమార్క.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని చెప్పారు. ఇక్కడ ఎవరున్నా లేకపోయినా పదికి 9 అసెంబ్లీ స్థానాలను కార్యకర్తలు గెలిపించారని భట్టి అన్నారు. మతం పేరుతో దేశంలో బీజేపీ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తోందనీ.. ప్రజలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి.. రాహుల్‌గాంధీ ప్రజల కష్టాలను తెలుసుకున్నారని భట్టి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యం కోసమనీ.. ఓటర్లు అంతా ఆలోచించి తమ హక్కును వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.