కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా.. యాదాద్రిలో వివాదంపై భట్టి క్లారిటీ

యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  12 March 2024 4:30 PM IST
telangana, deputy cm bhatti, comments, congress,

 కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా.. యాదాద్రిలో వివాదంపై భట్టి క్లారిటీ 

యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి బల్లాపై కూర్చొన్నారు. వారి పక్కనే మరో చిన్న స్టూల్‌పై కూర్చొని భట్టి ఫొటో దిగారు. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. భట్టిని అవమానించారంటూ వార్తలు వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా ఈ సంఘటనను తప్పుబట్టాయి. తాజాగా ఇదే విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దేవుడిపై భక్తి భావంతోనే అలా చేశానని ఆయన వెల్లడించారు. ఒక్క ఫొటోతో సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనని ఎవరూ అవమానించలేదంటూ ఈ సందర్భంగా భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. దీన్ని అందరూ అర్థం చేసుకుని ఇకనైనా దీనిపై రాదాంతం చేయడం మానుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. యాదాద్రి ఆలయంలో జరిగిన వివాదంపై వివరణ ఇచ్చారు.

తాను ఎవరికీ తల వంచే వ్యక్తిని కాదంటూ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని తెలిపారు. ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక వంటి మూడు శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరో పక్కనపెడితే తాను కూర్చొనే రకం కాదని అన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకొనే మనస్తత్వం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. భట్టి తాజాగా వ్యాఖ్యలతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లు అయ్యింది.

Next Story