Telangana: రూ.2లక్షల రుణమాఫీపై అలర్ట్.. వారికే వర్తింపు..!

రైతులు ఆశగా ఎదురుచూస్తోన్న మరో పథకం రూ.2లక్షల రుణమాఫీ.

By Srikanth Gundamalla  Published on  17 Jun 2024 7:30 AM IST
telangana, crop loan,    new proposal, government,

 Telangana: రూ.2లక్షల రుణమాఫీపై అలర్ట్.. వారికే వర్తింపు..!

తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ఇక రైతులు ఆశగా ఎదురుచూస్తోన్న మరో పథకం రూ.2లక్షల రుణమాఫీ. తాము అధికారంలోకి వచ్చాక రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు.. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ వరకు ఈ పథకాన్ని అమలు చేస్తామని చెబుతోంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలపై కసరత్తు చేస్తోంది. అర్హులైన వారికే రుణమాఫీ ఇవ్వాలని ప్రతిపాధనలు సమర్పిస్తున్నారు అధికారులు. పాస్‌ బుక్‌లు, రేషన్‌కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

రూ.2లక్షల రుణమాఫీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపన్ను చెల్లించే వారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని మంత్రిమండలి సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లు సమాచారం. పంట రుణాలపై ఈ వారంలోనే సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయశాఖ అధికారుల నుంచి రూ.2లక్షల వరకు రుణాలు తీసుకున్న జాబితాను బ్యాంకుల నుంచి ప్రభత్వం తెప్పిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఈ జాబితా అధికారులకు చేరనుంది. ఈలోపే రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయశాఖ వివిధ ప్రామాణికాల ప్రాతిపదికన విస్తృతస్థాయిలో అధ్యయనం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

తెలంగాణలో రైతుబంధు పథకం అందుకుంటున్న రైతులు 66 లక్షల మంది ఉన్నారు. రూ.2లక్షల లోపు రుణాలు పొందినవారు దాదాపు అందరూ ఉంటారని అధికారులు చెబుతున్నారు. రైతుబంధు లబ్ధిదారుల్లో దాదాపు ఆరు లక్షల మందికి పట్టాదారు పాస్‌పుస్తకాలు లేవు. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేషన్‌కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని తద్వారా మరో 18 లక్షల మంది తగ్గే అవకాశం ఉందని అధికారులు నివేదిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లించేవారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే మరో 2 లక్షల మంది వరకు తగ్గుతారని చెబుతున్నారు. మొత్తం మీద 40 లక్షల వరకు రుణమాఫీ పథకం కిందకు వస్తారని అధికారులు నివేదిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.

Next Story