తెలంగాణ పీసీసీపై దాదాపుగా స్పష్టత.. త్వరలోనే ప్రకటించే చాన్స్
తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla
తెలంగాణ పీసీసీపై దాదాపుగా స్పష్టత.. త్వరలోనే ప్రకటించే చాన్స్
తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత కొన్నాళ్లుగా కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు ఎవరికిస్తారనే దానిపై ఆసక్తి కొనసాగింది. అధ్యక్షుడిపై దాదాపుగా స్పష్టత వచ్చినట్లు తెలిసింది. సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త చీఫ్‌ను ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలు లాబీయింగ్ చేశారు. కొన్నాళ్లు ఢిల్లీలోనే మకాం వేశారు. చివరకు హైకమాండ్ ఎస్టీ నేత వైపు మొగ్గు చూపారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
కాగా.. పీసీసీ ఎంపిక కోసం ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు. హైకమాండ్ పెద్దలతో మాట్లాడారు. మంత్రులు, పలువురు ముఖ్య నేతల సూచనలను కూడా తీసుకుని అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పదవి ఇచ్చేందుకు అధిష్టానం సుముఖత తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనకు పీసీసీ బాధ్యతలు ఇవ్వడంపై సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఇతర నాయకులు కూడా సానుకూలంగా ఉన్నారని తెలిసింది. అందరి అభిప్రాయం తీసుకున్నాకే బలరాం నాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పది పదిహేను రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
పీసీసీ చీఫ్ బాధ్యతలు ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి వద్దే ఉన్నాయి. ఆయన ఆగస్టు 2వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్లి 14వ తేదీన తిరిగి వస్తారు. ఆ తర్వాత పీసీసీ కొత్త చీఫ్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు కార్యనిర్వహక అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది.