తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ ఈసీని కోరిన కాంగ్రెస్
తెలంగాణలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 April 2024 10:15 AM ISTతెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ ఈసీని కోరిన కాంగ్రెస్
తెలంగాణలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఒక విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని పెంచాలని ఎన్నికల సంఘాన్ని శనివారం అభ్యర్థించింది. ఈ మేరకు టీపీసీసీ సీనియర్ నేత నిరంజన్ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు లేఖ రాశారు.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే.. ఆ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే గంట పాటు పోలింగ్ సమయాన్ని పొడిగించాలని లేఖలో కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ పేర్కొన్నారు. తన లేఖలో వాతావరణశాఖ హెచ్చరికలను ప్రస్తావించారు. మధ్యాహ్నం వేళల్లో ఎండలు తీవ్రంగా ఉంటున్నాయనీ.. ఆ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారని పేర్కొన్నారు నిరంజన్. అంతేకాదు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిందని చెప్పారు. ఎండలు, వడగాల్పులు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు మధ్యామ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వస్తారని ఆశించలేమని లేఖలో రాసుకొచ్చారు.
ఎండలు తీవ్రంగా ఉండటం పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు దారి తీస్తుందని నిరంజన్ చెప్పారు. అందుకే పోలింగ్ సమయాన్ని సాయంత్రం వేళ ఒక గంటపాటు పొడిగించాలని లేఖ ద్వారా ఎన్నికల సంఘాన్ని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. తద్వరా ఓటు వేసేందుకు ప్రజలు ముందుకు వచ్చేలా ప్రోత్సహించడంతో పాటు.. పోలింగ్ శాతాన్ని పెంచినవాళ్లం అవుతామని చెప్పారు. శాంతిభద్రతల సమస్య ఉన్న స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయత్రం 4 వరకు పోలింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సమస్యలు లేవనీ అన్నారు. ఆయా ప్రాంతాలైన సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల,మంథని, భూపాలపల్లి, ములుగు,పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పోలింగ్‌ను సాయత్రం 6 వరకు నిర్వహించాలని నిరంజన్ లేఖలో విన్నవించారు.