గృహనిర్బంధంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Telangana Congress leaders placed under house arrest. హైదరాబాద్‌: సర్పంచ్ నిధుల సమస్యల పరిష్కారం కోరుతూ, సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న

By అంజి  Published on  2 Jan 2023 12:18 PM IST
గృహనిర్బంధంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్‌: సర్పంచ్ నిధుల సమస్యల పరిష్కారం కోరుతూ, సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నా చౌక్ వద్ద ధర్నాకు సిద్ధమైన కాంగ్రెస్‌ నాయకులను సోమవారం నాడు పోలీసులు గృహనిర్బంధం చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఇతర నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో జూబ్లీహిల్స్‌లోని ఇందిరాపార్క్‌కు వెళ్లకుండా జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసం వెలుపల పోలీసు సిబ్బందిని మోహరించారు. మరో టీపీసీసీ నేత మహేశ్ కుమార్ గౌడ్‌ను కూడా పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.

రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ప్రశ్నిస్తూ.. ''సీఎం ప్రగతి భవన్ నుండి బయటకు రారు, సామాన్యులకు ప్రవేశం లేదు. ప్రశ్నిస్తే.. కేసులు, గృహనిర్బంధాలు ఎదుర్కోవాలి. రాష్ట్రంలో సర్పంచ్‌ల దుస్థితికి వ్యతిరేకంగా ధర్నా చేయకుండా పోలీసులు నా ఇంటిని, కాంగ్రెస్‌ ముఖ్య నాయకులందరినీ చుట్టుముట్టారు. ప్రజాస్వామ్యం.. ఎక్కడున్నావు!?'' అంటూ రాసుకొచ్చారు. తమ నేతల గృహనిర్బంధాలను ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ ఖండించింది. రోజంతా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ధర్నాకు దిగుతామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అంతకుముందు ధర్నాకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని మల్లు రవి ప్రశ్నించారు. "మేము నిర్ణీత ప్రదేశంలో శాంతియుతంగా ధర్నా చేయాలనుకుంటున్నాము," అని ఆయన అన్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ప్రజల ప్రజాస్వామ్య నిరసనల ప్రయోజనం కోసం స్థాపించబడిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు నిరాకరిస్తున్నదని, దీంతో గ్రామాల అభివృద్ధిపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్‌ నేత ఆరోపించారు. గ్రామాలకు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లు ధర్నా స్థలానికి తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని 12,750 పంచాయతీల్లోని సమస్యలు, ఎన్నికైన సర్పంచ్‌లకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ పార్టీ నిరసన తెలిపింది.

అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కు ఎక్కువగా విధేయులుగా ఉన్న సర్పంచ్‌లు ఏడాది కాలంగా ప్రభుత్వ నిధులు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదుల సంఖ్యలో రాజీనామాలు సమర్పించేందుకు ముందుకు వచ్చారు.

Next Story