Telangana: ఐటీశాఖ మంత్రిగా కాంగ్రెస్‌లో ఆయనైతేనే కరెక్ట్..!

తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

By Srikanth Gundamalla  Published on  6 Dec 2023 11:26 AM IST
telangana, congress, it minister, social media ,

 Telangana: ఐటీశాఖ మంత్రిగా కాంగ్రెస్‌లో ఆయనైతేనే కరెక్ట్..!

తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈలనె 7వ తేదీన రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే.. సీఎం ఎవరు అనేది తేలడంతో.. ఇప్పుడు మంత్రులు ఎవరు..? ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. అందులో ముఖ్యంగా ఐటీ శాఖ ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠగా మారింది. ఎందుకంటే.. గత పదేళ్లుగా ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. అనేక కంపెనీలను తీసుకురావడంతో పాటు.. ఐటీ హబ్స్‌ను నెలకొల్పారు. ఈ క్రమంలో ఆయన మార్క్‌ను టచ్‌ చేసేలా కాంగ్రెస్‌లో ఐటీశాఖ మంత్రి ఎవరు అవుతారనే దానిపై చర్చ నడుస్తోంది.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు పర్యాయాలు కేసీఆర్ సర్కార్‌లో ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ కొనసాగారు. ఆయన సమర్ధవంతమైన పనితీరుతో ఆ శాఖకే కొత్త వన్నెను తీసుకొచ్చారు. యువత ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యాపార వేత్తలుగా ఎదగాలని టీ-హబ్‌ అనే వేదికకు అంకురార్పణ చేశారు. ఇది పూర్తిగా కేటీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టిందే. ఏడేళ్లు తిరిగే సరికి ఐటీ హబ్‌ ప్రపంచ స్థాయి స్టార్టప్‌లకు వేదికగా మారింది. అలాగే చాలా ప్రతిష్టాత్మక సంస్థలు తమ కార్యక్రమాలు హైదరాబాద్‌ నుంచి నిర్వహించేలా వాటిని ఒప్పించి ఇక్కడకు తీసుకొచ్చారు. ఇక్కడ పెట్టబడులు పెట్టేలా దిగ్గజ సంస్థలను తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత సీఎం కంటే ఎక్కువగా.. ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్‌ను మిస్‌ అవుతామని. .కాంగ్రెస్‌లో ఆ రేంజ్‌లో పనిచేసే వారు ఎవరున్నారంటూ చర్చ మొదలుపెట్టారు.

తాజాగా నెటిజన్ల ప్రశ్నలకు కాంగ్రెస్‌ మద్దతుదారులు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. కేటీఆర్‌తో పాటుగా సరితూగే సమర్ధవంతులైన నాయకులు కాంగ్రెస్‌లో చాలా మంది ఉన్నారని అంటున్నారు. అయితే.. ప్రధానంగా ఐటీ శాఖకు ఒకరి పేరు వినబడుతోంది. ఆయనే ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసిన గెలిచిన మదన్‌ మోహన్‌రావు. ఈయన ఐటీ మంత్రిగా బాగా పనిచేస్తారని కాంగ్రెస్ మద్దతు దారులతో పాటు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ది వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడని.. యూఎస్‌ఎం బిజినెస్‌ సిస్టమ్‌ వ్యవస్థాపకుడు, అలాగే చైర్మన్‌గా కూడా వ్యవహరించారని చెబుతున్నారు. ఐటీ మంత్రిత్వ శాఖకు ఆయన సరైన వ్యక్తే అంటూ సూచిస్తున్నారు. అలాగే మదన్‌ మోహన్‌రావుకి కమ్యూనికేషన్ స్కిల్స్‌ బాగా ఉంటాయని అంటున్నారు. కేటీఆర్ స్థానాన్ని మదన్‌ మోహన్‌రావు కచ్చితంగా భర్తీ చేస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రేవంత్‌రెడ్డి సీఎం అభ్యర్థిగా ఎంపిక అయ్యిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లారు. కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపుతారు. మరి ఇంత చర్చనీయాంశంగా మారిని ఐటీశాఖను ఎవరికి కేటాయిస్తారనేది ఇవాళో.. రేపో తేలనుంది.

Next Story