త్వరలోనే 15వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 6:00 PM ISTత్వరలోనే 15వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని వెల్లడించారు. త్వరలోనే 15వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉండిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆరోగ్య తెలంగాణను నిర్మించడంలో స్టాఫ్ నర్సులది కీలక పాత్రి అని చెప్పారు. పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూసే ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అని పేర్కొన్నారు. ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం యువతను పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పదేళ్లలో యువత ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు వారి కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించి.. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన వారి ఉద్యోగాలనూ పట్టించుకోలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా కొత్త చైర్మన్, సభ్యులను నియమించామన్నారు. ఏడాదిలోగా కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తామని తీపి కబురు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నా కూడా.. ఆర్థిక భారమైనా ఉద్యోగాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఇంకా ఎంతో మంది యువత, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. నిరుద్యోగుల కలల సాకారానికి ఇది తొలి అడుగు అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి కారణమే నిరుద్యోగ సమస్య అనీ.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ సమస్యను తీర్చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.