మార్చి నుంచే అర్హులైన వారికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్
తెలంగాణ సచివాలయంలో ‘మహాలక్ష్మీ పథకం’ ‘గృహ జ్యోతి’ పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.
By Srikanth Gundamalla Published on 27 Feb 2024 5:15 PM ISTమార్చి నుంచే అర్హులైన వారికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్
మంగళవారం తెలంగాణ సచివాలయంలో ‘మహాలక్ష్మీ పథకం’ ‘గృహ జ్యోతి’ పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. అభయహస్తం గ్యారెంటీల అమల్లో భాగంగా వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ ముందుగా చెప్పినట్లుగా అన్ని గ్యారెంటీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. గ్యారెంటీలను నమ్మే ప్రజలు తమకు అధికారం ఇచ్చారనీ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఒక్కో పథకాన్ని అమల్లోకి తెస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, రూ.10 లక్షలతో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా రూ.500కే సిలిండర్‌తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాలను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపేలా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇస్తున్నామనీ.. మహాలక్ష్మి పథకం కింద సబ్సిడీతో రూ.500కే సిలిండర్ అందిస్తామని అన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికే ఈ పథకాలు వర్తిస్తాయని మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గ్యారెంటీల గురించి ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందనీ.. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేలా పాలన సాగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
మార్చి నుంచి 200 యూనిట్లలోపు వాడే వారికి జీరో బిల్లు: భట్టి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆరు గ్యారెంటీల వైపు దేశం మొత్తం చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఆరు హామీలు ఒక విప్లవాత్మకమైనవని చెప్పారు. అయితే.. మార్చి నెల నుంచే 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడిన వారికి జీరో బిల్లులు వస్తాయని అన్నారు. రూ.500కే సిలిండర్ అందించడం ద్వారా చాలా కుటుంబాలకు రిలీఫ్ దొరుకుతుందని భట్టి వ్యాఖ్యానించారు. అలాగే.. అర్హులు అయివుండి ప్రజాపాలన దరఖాస్తులు చేసుకోని వారు ఎవరైనా ఉంటే మండల కార్యాలయాలకు వెళ్లి ప్రజాపాలన అధికారికి దరఖాస్తు పెట్టుకుంటే కచ్చితంగా లబ్ధి చేకూరుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.