TG అక్షరాలు ఉండాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్

వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  5 Feb 2024 12:57 PM IST
telangana, cm revanth reddy,   TG registrations,

TG అక్షరాలు ఉండాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా పేరు మార్చడంతో పాటు ఇతర అంశాల్లో కూడా మార్పులు చేసింది. తాజాగా జరిగిన కేబినెట్‌ భేటీలో మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు వాహన రిజిస్ట్రేషన్‌ పేరు టీఎస్‌తో ఉండగా.. వాటిని టీజీగా మార్చేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. ఇదే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందనేదానిపై ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు.

తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టిన ఆయన.. ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే అని చెప్పారు. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతో.. 'జయ జయహే తెలంగాణ...' గీతాన్ని రాష్ట్ర అధికారికగ గీతంగా.. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా ఉండాలని అన్నారు. రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇక వాహన రిజిస్ట్రేషన్లలో టీఎస్ బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అనే అక్షరాలు ఉండాలన్నారు. ఇది తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్పారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.


Next Story