జనవరి 26 తర్వాత జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి..!

మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమ సత్తా చూపించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

By Srikanth Gundamalla
Published on : 21 Jan 2024 1:55 PM IST

telangana, cm revanth reddy, tour,

జనవరి 26 తర్వాత జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి..!

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే లోక్‌సభ ఎన్నికలు వస్తున్నాయి. దాంతో.. ఆ పార్టీ మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమ సత్తా చూపించాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఎక్కువ లోక్‌సభా స్థానాలను గెలవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కమిటీతో పాటు జిల్లాల ఇంచార్జులను కూడా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే గట్టిగా కష్టపడి ఫలితాలను అందుకోవాలని చూస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పరిపాలన వ్యవహారాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇక జనవరి చివరి వారంలో జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉంటే అందులో 12 స్థానాలకు తగ్గకుండా గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల మంత్రులు, నేతలతో కూడా సీఎం రేవంత్‌రెడ్డి సమావేశాలు నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలపై నాయకులతో లోతగా చర్చించారు. తన జిల్లాల పర్యటన గురించి కూడా సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు.

కాగా.. ఈ నెల 26వ తేదీ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారని తెలుస్తోంది. మొదటగా ఇంద్రవెల్లిలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. గతంలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోగానే ఇంద్రవెల్లిలో సభ నిర్వహించారు రేవంత్‌రెడ్డి. ఇప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. మొదట ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని కవర్ చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత మిగతా జిల్లాల్లో రేవంత్‌ టూర్‌పై రాష్ట్ర నాయకత్వం చర్చలు జరిపి.. షెడ్యూల్‌ ఖరారు చేయనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story