సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, రాయదుర్గం-శంషాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నిలిపివేత
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 7:55 AM IST
సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, రాయదుర్గం-శంషాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నిలిపివేత
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణపై రివ్యూ సమావేశంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. ఓఆర్ఆర్ వెంట జీవో 11 ప్రాంతంలో మెట్రో ఎలైన్‌మెంట్‌ను రూపొందించడంపై అధికారులను ప్రశ్నించారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుపై అధికారులను ఆరా తీశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఓఆర్ఆర్ ఉన్న నేపథ్యంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు.
ఈ మెట్రో మార్గాన్ని ఆపాలంటూ ఆదేశించడంతో పాటు మరో రెండు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఎంజీబీఎస్- ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్టు మీదుగా ఎలైన్‌మెంట్ రూపొందించాలని చెప్పారు. ఇందులో భాగంగా రెండు మార్గాలను పరిశీలించాలని చెప్పారు రేవంత్‌రెడ్డి. చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, విమానాశ్రయం పీ7 రోడ్డు ఒక మార్గం అవ్వగా.. చాంద్రాయణగుట్ట, బార్కాస్, పహాడీషరీఫ్, శ్రీశైలం రోడ్డు మార్గాన్ని కూడా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈ మార్గాల్లో ఏది తక్కువ ఖర్చుతో కూడుకున్నదో తేల్చి.. దాన్ని కొత్త ఎలైన్‌మెంట్ రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
కాగా.. రాయదుర్గం- శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ సర్కార్ ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేసింది. టెండర్లను కూడా పిలిచింది. వాటికి ఆమోదం తెలిపే క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో.. ఆ పనులు ఆగిపోయాయి. ఈ లైన్‌కు దాదాపు రూ.6,250 కోట్ల వ్యం అవుతుందని అంచనా వేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఓఆర్ఆర్ ఉన్న కారణంగా ఈ కారిడార్‌లో మెట్రో లైన్ అవసరం లేదని తెలిపింది.
మరోవైపు పాతబస్తీలోని ఎంజీబీఎస్-ఫలక్‌నుమా వరకు 5.5 కి.ఈ మార్గాన్ని ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో మార్గాన్ని పూర్తి చేయకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి పూర్తి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎయిర్‌పోర్టు మెట్రోపైనా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.