డ్రగ్స్‌ నియంత్రణపై ప్రచారం చేస్తేనే సినిమా టికెట్ల రేట్లు పెంపు: సీఎం రేవంత్

ఇటీవల తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on  3 July 2024 6:11 AM IST
Telangana, cm revanth reddy,  Chiranjeevi, awareness drugs video,

డ్రగ్స్‌ నియంత్రణపై ప్రచారం చేస్తేనే సినిమా టికెట్ల రేట్లు పెంపు: సీఎం రేవంత్

ఇటీవల తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ఒక వీడియో రూపొందించి దాన్ని ప్రభుత్వానికి పంపించారు. ఆ వీడియో మెగాస్టార్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ను నియంత్రించాలంటూ అవేర్నెస్ కలిగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంది. డ్రగ్స్‌కు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు.

అయితే.. చిరంజీవి డ్రగ్స్ అవేర్నెస్‌ వీడియో చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి వంటి అగ్ర నటుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనడం హర్షణీయమని చెప్పారు. అయితే.. మిగతా సినీ తారలు చిరంజీవి తరహాలో ప్రచారం చేయకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏదైనా సినిమా రిలీజ్ అయితే.. టికెట్ల రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు తప్ప సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదన్నారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్‌ నియంత్రణ పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు రావాలన్నారు. ఇక నుంచి టాలీవుడ్‌ ప్రముఖులు ఎవరైనా సరే టికెట్ల రేట్ల పెంపు కోసం వస్తే ముందుగా డ్రగ్స్, సైబర్ క్రైమ్‌ అవేర్నెస్‌ పై వీడియో ఇస్తేనే టికెట్ల రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంగా చెప్పారు. డ్రగ్స్ వాడగాన్ని వ్యతిరేకిస్తూ చిరంజీవి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన కామెంట్స్ వీడియోను తెలంగాణ పోలీసులు ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ వీడియోను రీట్వీట్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిరంజీవి థాంక్యూ చెప్పారు. ప్రజలకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది తన బాధ్యతగా భావిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

Next Story