మరో మూడు గ్యారెంటీలు అమలు..రేపే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన!

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది.

By Srikanth Gundamalla  Published on  1 Feb 2024 8:30 PM IST
telangana, cm revanth reddy,  guarantees,

 మరో మూడు గ్యారెంటీలు అమలు..రేపే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన!

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తోన్న ప్రభుత్వం మిగతా వాటిపై దృష్టి పెట్టింది. అయితే.. హామీల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్‌ సబ్‌ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీల్లో మరో మూడు గ్యారెంటీలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, రూ.500కు గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యత్‌ పథకాలపై ఆయా సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఒక్కో గ్యారెంటీ అమలుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ మేరకు బడ్జెట్‌లో వాటికి అవసరమైన నిధులను కేటాయించాలని ఆర్థిక శాఖకు సూచించారు.

కాగా.. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది ఆయనకు మొదటి జిల్లా పర్యటన. అయితే.. ఈ మూడు గ్యారెంటీల అమలుపై ఇంద్రవెల్లి సభ ద్వారానే ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500కే సిలిడర్‌ పథకాలను ఇంద్రవెల్లి సభా వేదిక ద్వారా ప్రకటిస్తారని తెలుస్తోంది. మూడు పథకాల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. కాగా.. 200 యూనిట్ల విద్యుత్ వాడే కుటుంబాలు రాష్ట్రంలో 90 లక్షలు ఉన్నట్లు సీఎం రేవంత్‌రెడ్డికి అధికారులు తెలిపారు.

మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి గడ్డను తన సెంటిమెంట్‌గా భావిస్తారు. పీసీసీ చీఫ్‌గా ఎంపిక అయిన తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే పీసీసీ చీఫ్ హోదాలో మొదటి సభ నిర్వహించారు. అప్పుడు సభకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. సభ సక్సెస్‌ కావడం.. ఆ తర్వాత పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడం జరిగిపోయాయి.

Next Story