సీఎం రేవంత్‌ చొరవ.. కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం

విధి నిర్వహణలో పాల్గొన్న ఓ కానిస్టేబుల్‌ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

By Srikanth Gundamalla  Published on  9 Jan 2024 11:56 AM GMT
telangana, cm revanth reddy,  job,  constable wife,

 సీఎం రేవంత్‌ చొరవ.. కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం 

విధి నిర్వహణలో పాల్గొన్న ఓ కానిస్టేబుల్‌ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. అతని భార్యకు స్థానికత కారణంగా చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగాన్ని నిరాకరించింది. తాజాగా ప్రజాపాలన ద్వారా దరఖాస్తు స్వీకరించిన సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకున్నారు. మనవతా దృక్పథంతో నిబంధనలను సడలించి సదురు కానిస్టేబుల్‌ భార్యకు ఉద్యోగాన్ని కల్పించారు.

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని అంబర్‌పేట పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో సొంగా శేఖర్‌ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేశాడు. విధుల్లో ఉండగా 2021 సెప్టెంబర్ 30న ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే.. అతని భార్య సత్యలత ఏపీకి చెందిన మమిళ కావడంతో స్థానికత నిబంధనలు కారణంగా చూపి గత ప్రభుత్వం ఆమెకు ఉద్యోగం కల్పించలేదు. దాంతో.. రెండేళ్లుగా ఆ కుటుంబం ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటూనే ఉంది. కానీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి కానిస్టేబుల్ భార్య సత్యలత మరోసారి ప్రజాపాలన ద్వారా అర్జీ పెట్టుకుంది. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తమ కుటుంబ దీనస్థితి గురించి వివరించింది.

ఆమె కష్టాలపై మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, రాచకొండ సీపీలకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం కల్పిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో.. రాచకొండ పోలీస్‌ కిషషనర్‌ కార్యాలయంలో తాజాగా సత్యలతకు నియామక పత్రాలను అందజేశారు. ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్ధవంతంగా నీతి, నిజాయితీతో పనిచేయాలని రాచకొండ సీపీ కోరారు. అంతేకాదు.. భవిష్యత్‌లో ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని సీపీ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో సత్యలతకు ఉద్యోగం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డీజీపీ, రాచకొండ సీపీకి కానిస్టేబుల్‌ శేఖర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story