తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. నలుగురికి చాన్స్!

తెలంగాణలో కేబినెట్‌ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  20 Jun 2024 9:00 AM IST
Telangana, cm revanth reddy,  cabinet ,

తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. నలుగురికి చాన్స్!

తెలంగాణలో కేబినెట్‌ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది నెలలకే ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల బిజీలో పడిపోయారు నాయకులు. ఇటీవల ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయడంతో కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డితో పాటు.. మరో 11 మంది మంత్రులు తెలంగాణ కేబినెట్‌లో ఉన్నారు. వాస్తవానికి కేబినెట్‌లో 18 మంది మంత్రుల వరకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డి మరో నలుగురు మంత్రులను తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ నెల చివరి వరకు లేదా జులై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తతుం కీలక శాఖ హోంతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, విద్య వంటి కీలక శాఖలు సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉన్నాయి. ఆయా శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలతో చర్చించారనీ.. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలి దశలో నలుగురికి అవకాశం ఇచ్చి.. ఆ తర్వాత మరో ఇద్దరిని కూడా తీసుకోనున్నారని సమాచారం. ఈ క్రమంలోనే మంత్రి పదవులు ఇవ్వనున్న నేపథ్యంలో పలువురు నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్‌ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈ జిల్లా నుంచి ఇప్పటికి మంత్రివర్గంలో ఎవరూ లేరు దాంతో.. ఆయనకు అవకాశం దక్కొచ్చనే వార్తలు ఉన్నాయి. మక్తల ఎమ్మెల్యే వాకటి శ్రీహరి పేరు కూడా తెరపైన ఉంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయనకు అవకాశం దక్కొచ్చనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, గడ్డం వివేక్‌ పేర్లు కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారని వినిపిస్తోంది. ఎన్నికల ముందు వీరు బీజేపీలో ఉండగా.. మంత్రి పదవి హామీతోనే కాంగ్రెస్‌లో చేరారని సమాచారం.

ఇక రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఈ జిల్లాల నుంచి కూడా ఒకరికి చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డితో పాటు.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పేరు కూడా వినపడుతోంది. ఇద్దరిలో ఒకరికి చాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మైనార్టీ కోటాలో హైదరాబాద్ నుంచి ఒక నాయకుడికి మంత్రిగా అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తోందట. మొత్తంగా నలుగురిని ఇప్పుడు మంత్రులుగా తీసుకుని.. ఆ తర్వాత మరో ఇద్దరికి కూడా త్వరలోనే అవకాశం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Next Story