తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధిష్టానం వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్‌ ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది.

By Srikanth Gundamalla  Published on  7 Jan 2024 9:00 AM IST
telangana, cm revanth reddy, election committee chairman,

తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఆరు గ్యారెంటీల అమలు కోసంప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరించింది. ఇక కొద్ది నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో అధిక స్థానాల్లో లోక్‌సభ స్థానాలను గెలవాలని చూస్తోంది కాంగ్రెస్. ఈ మేరకు సమయాత్తం అవుతోంది. ఇందులో భాగంగానే అధిష్టానం వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్‌ ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది.

తెలంగాణ ప్రదేశ్‌ ఎలక్షన్ కమిటీ చైర్మన్‌గా సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఆయనతో పాటు మొత్తం కమిటీలో 25 మందికి చోటు కల్పించింది. అలాగే ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు కూడా కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా.. సభ్యులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, డి. శ్రీధర్‌ బాబు, సీతక్క, దామోదర రాజనర్సింహ, సీనియర్‌ నేతలు జానారెడ్డి, వి. హనుమంతరావు, మధుయాష్కీ గౌడ్, సంపత్‌ కుమార్‌, రేణుకా చౌదరి, బలరామ్‌ నాయక్‌, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజహరుద్దీన్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మహేశ్వర్ కుమార్‌ గౌడ్‌, షబ్బీర్‌ అలీ, ప్రేమ్‌సాగర్‌ రావు, పొదెం వీరయ్య, సునీతారావుకు కాంగ్రెస్ అధిష్టానం స్థానం కల్పించింది.

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి చురుగ్గా పనిచేశారు. అన్ని నియోజకవర్గాల్లో కలియతిరిగారు. అలాగే.. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన పాత్ర పోషించాలనీ.. తద్వారా ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్‌ను గద్దె దించాలని భావిస్తోంది. ఆ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆయా పార్టీలను కలుపుకొని ఇండియా కూటమని ఏర్పాటు చేసింది.


Next Story