హోలీ పండుగలోగా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్‌రెడ్డి
మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 21 March 2024 7:50 PM ISTహోలీ పండుగలోగా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్‌రెడ్డి
మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నేతలు, ప్రజలను ఉద్దేశించి పలు కామెంట్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే అన్నారు. తాను సీఎంగా ఉండటానికి కారణం మల్కాజ్‌గిరి కార్యకర్తలే కారణమని చెప్పారు. కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి ఢిల్లీకి పంపించారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు.
ఇక కేసీఆర్ పతనం 2019లో మల్కాజిగిరిలో వారి ఓటమి తర్వాతే మొదలైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10లక్షలకు పెంపు, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేశామని చెప్పారు. అంతేకాక ఇప్పటికే రాష్ట్రంలో 30వేల ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంలో ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఎగురాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే కంటోన్మెంట్‌లో కూడా కాంగ్రెస్ జెండాను ఎగరేయాల్సిన అవసరం ఉందన్నారు. హోలీ పండగ లోగా కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటిస్తుందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరినీ తాను గుర్తు పెట్టుకుంటానని అన్నారు రేవంత్. ప్రభుత్వంలో భాగస్వామ్యులను చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రణాళిక బద్దంగా ప్రచారం నిర్వహించుకుని.. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.