దానం నాగేందర్‌ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాదే: సీఎం రేవంత్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లో హీట్‌ పెరిగింది.

By Srikanth Gundamalla  Published on  5 May 2024 7:31 AM IST
telangana, cm revanth reddy, comments, danam nagender ,

దానం నాగేందర్‌ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాదే: సీఎం రేవంత్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లో హీట్‌ పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో తలామునకలయ్యాయి. ఈ సందర్భంగానే రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు.. ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్న క్రమంలో.. రాజకీయ పార్టీల అగ్రనేతలంతా ప్రజల్లో కలియతిరుగుతూ తమ అభ్యర్థులను గెలిపించాలని విన్నవించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని.. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ... ఇక్కడ తెలంగాణలో గతంలో అధికారంలో ఉండగా కేడీ పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చారంటూ తీవ్రంగా మండిపడ్డారు. సికింద్రాబాద్‌ ఎంపీగా కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ను గెలిపించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ కోరారు. దానం నాగేందర్‌ను ఎంపీగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఆయన్ని కేంద్ర మంత్రిగా చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.

జంట నగరాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీ గెలవాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యూనివర్సిటీ భూములను కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్నవారి పని దానం నాగేందర్‌ చూసుకుంటాడని చెప్పారు. అలాగే యువ నేత అనిల్‌ కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు పంపినట్లు చెప్పారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను ఎమ్మెల్సీ చేశామని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు దక్కుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు కృష్ణా జలాలు రావడానికి కారణం అప్పుడు పీజేఆర్ తీసుకున్న నిర్ణయమే కారణమన్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును కూడా కాంగ్రెస్సే కట్టించిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.

Next Story