30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 26 Sept 2024 6:25 PM ISTతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రజలకు మరో 30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆస్పత్రిని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందాలనేదే తమ లక్ష్యమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఖర్చును రూ.10లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే.. రాబోయే 30 రోజుల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ విడి విడిగా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్స్‌ను డిజిటలైజ్ చేయాల్సి ఉందన్నారు. ఆ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు అన్నీ ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. . దుర్గాబాయి దేశ్‌ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.