రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్
Telangana CM KCR will go to Delhi tomorrow. తెలంగాణ సీఎం, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్.. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.
By అంజి Published on 11 Dec 2022 12:45 PM ISTతెలంగాణ సీఎం, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్.. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ముందుగానే నిన్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌లు ఢిల్లీ వెళ్లారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండీ పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 14న ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. మంత్రులు.. తమ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఢిల్లీకి తీసుకురాలని సీఎం సూచించారు. దాదాపు 450 మంది నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.
పార్టీ కార్యాలయం ప్రారంభం తర్వాత జాతీయ అంశాలపై కేసీఆర్ దృష్టి సారించనున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయాలను ఢిల్లీలో ఎండగట్టేందుకు విధానాలను రూపొందించుకుంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ జాతీయ విధానంపై పలువురితో చర్చించే అవకాశం ఉంది. త్వరలోనే బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గం ఏర్పాటు, జాతీయ కార్యదర్శుల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.
డిసెంబర్ 9న టీఆర్ఎస్ పార్టీ... భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మార్చుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆమోదం తెలిపింది. టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చాలని ఈ సంవత్సరం దసరా పండుగ రోజున సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం లేఖ రాశారు. సీఎం కేసీఆర్ రాసిన లేఖపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈసీ ఆమోద ముద్ర వేసింది. పార్టీ పేరు మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కేసీఆర్‌కు అధికారికంగా లేఖ పంపింది.