Paris Olympics: తెలంగాణ అథ్లెట్లకు ఫోన్‌ చేసిన సీఎం రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం నాడు పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొన్న రాష్ట్రానికి చెందిన క్రీడాకారులతో ఫోన్‌లో మాట్లాడారు.

By అంజి  Published on  29 July 2024 4:45 PM IST
Telangana,  CM Revanth, athletes, Paris Olympics

Paris Olympics: తెలంగాణ అథ్లెట్లకు ఫోన్‌ చేసిన సీఎం రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం నాడు పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొన్న రాష్ట్రానికి చెందిన క్రీడాకారులతో ఫోన్‌లో మాట్లాడి, వారి వారి ఈవెంట్‌ల మొదటి రౌండ్‌లో విజయం సాధించినందుకు వారిని అభినందించారు. బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి శ్రీజ ఆకుల, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధులతో ముఖ్యమంత్రి మాట్లాడి.. వారి అత్యుత్తమ ప్రదర్శనకు అభినందనలు తెలిపారు.

అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతోన్న షూటర్ ఈషా సింగ్‌తో కూడా మాట్లాడి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. రాష్ట్రంలోని క్రీడాకారులందరూ తదుపరి రౌండ్లలో ఇదే ప్రదర్శనను కొనసాగించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల విభాగంలో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనా క్లోట్జర్‌ను ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ అకుల స్వీడన్‌కు చెందిన క్రిస్టినా కల్‌బర్గ్‌పై 4-0 తేడాతో విజయం సాధించి 32వ రౌండ్‌లోకి ప్రవేశించింది.

స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన పీవీ సింధు.. పారిస్ ఒలింపిక్స్‌లో మాల్దీవ్స్‌కు చెందిన ఫాతిమత్ అబ్దుల్ రజాక్‌పై విజయంతో తన జైత్రయాత్రను ప్రారంభించింది.

అంతకుముందు, పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారతదేశానికి చారిత్రాత్మక కాంస్యం సాధించినందుకు షూటర్ మను భాకర్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. ఆమె ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళా షూటర్‌గా నిలిచింది. మను భాకర్‌ సాధించిన విజయానికి గర్విస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.

Next Story