పోలవరం, నల్లమల్లసాగర్‌పై రేపు సుప్రీంలో విచారణ..సీఎం రేవంత్ కీలక మీటింగ్

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు

By -  Knakam Karthik
Published on : 4 Jan 2026 8:20 PM IST

Telangana, Chief Minister Revanth Reddy, Polavaram, Nallammallasagar, Supreme Court, Advocate Abhishek Singhvi

పోలవరం, నల్లమల్లసాగర్‌పై రేపు సుప్రీంలో విచారణ..సీఎం రేవంత్ కీలక మీటింగ్

గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ సోమవారం (రేపు) సుప్రీంకోర్టు లో విచారణకు రానుంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరఫున సమర్థమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. అవసరమైన అన్నిఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు.

అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమలసాగర్ కు లింక్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ పనులు ఆపేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని పలు అంశాలను ప్రస్తావించింది.

మొదట్లో ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు పనుల స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్ధం కావని ఈ పిటిషన్ లో స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రీ ఫిజిబులిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించటం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది. అందుకు సంబంధించి కేంద్ర జల సంఘం, కేంద్ర జల మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరింది.

కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి సిద్ధపడుతోందని, వెంటనే ఈ చర్యలను ఆపాలని కోరింది. ఏపీ తలపెడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో ప్రస్తావించింది.

Next Story