హైదరాబాద్: జూలై 16న ఉదయం 9.30 గంటల నుంచి సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్‌లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం-సీజనల్ పరిస్థితులు, ఆరోగ్యం-సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతిభద్రతలు, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం సహా వివిధ అంశాలను ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు సంబంధిత సమాచారంతో సదస్సుకు హాజరుకావాలని సీఎస్ ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. ఆదాయం రాబట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఎవరినీ ఉపేక్షించకుండా పన్ను వసూలు చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. ఇకపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానన్న సీఎం తెలిపారు. వార్షిక లక్ష్యం చేరుకోవాలంటే నెలవారీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఆదాయం తెచ్చిపెట్టే డిపార్ట్‌మెంట్లన్నీ వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.