ఆరు గ్యారెంటీలను మర్చిపోవాలనే.. హైడ్రా పేరుతో డ్రామా: బండి సంజయ్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  30 Aug 2024 10:00 AM IST
Telangana, Bandi sanjay, comments,  congress govt ,

 ఆరు గ్యారెంటీలను మర్చిపోవాలనే.. హైడ్రా పేరుతో డ్రామా: బండి సంజయ్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పరిధిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. చాలా ఇళ్లకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. తాజాగా ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి విమర్శలు చేశారు. ఆరు గ్యారెంటీలను ప్రజలు మర్చిపోయేందుకే తెరమీదకు హైడ్రా అంశాన్ని తెచ్చారని అన్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే అని అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఈ కామెంట్స్ చేశారు. జన్వాడ ఫామ్‌హౌస్‌ నిర్మాణం కూల్చివేతలో సీఎం రేవంత్‌రెడ్డి రోషం ఏమైందంటూ ప్రశ్నించారు. సల్కం చెరువు ఆక్రమణలపై ఒవైసీ బెదిరిస్తే భయపడతావా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డి బండి సంజయ్ ప్రశ్నించారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఒవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్నారు. రైతు రుణమాఫీ అంటూ చెప్పిన మాటలు అన్నీ బోగస్ అన్నారు బండి సంజయ్. మహిళలను ప్రభుత్వం ఆదుకోలేదనీ.. నోటిఫికేషన్లు ఇవ్వలేదనీ అన్నారు. తెలంగాణ యువరాజు అమెరికా వెళ్తే..ఆయన్ని కలిసేందుకు కాంగ్రెస్ నేతలూ వెళ్తున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు విలీనం ఖరారు అయ్యిందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలతో నేతన్నలు అప్పులపాలై నష్టపోయారని అన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన బకాయిలను దాటవేస్తూనే వస్తున్నారని అన్నారు. లక్షల రూపాయల విద్యుత్‌ బకాయిలతో నేతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారనీ.. ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు.

Next Story