తెలంగాణ కేబినెట్‌లో ఖాళీగా మరో ఆరు బెర్త్‌లు, ఎవరిని తీసుకుంటారు?
తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో ముఖ్యమంత్రితో పాటు 17 మంది మంత్రులు ఉండాలి. ప్రస్తుతం మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 8 Dec 2023 11:21 AM ISTతెలంగాణ కేబినెట్‌లో ఖాళీగా ఆరు బెర్త్‌లు, ఎవరిని తీసుకుంటారు?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కను ఏఐసీసీ ఎంపిక చేసింది. అయితే.. తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో ముఖ్యమంత్రితో పాటు 17 మంది మంత్రులు ఉండాలి. ప్రస్తుతం 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. దాంతో.. మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మరి ఆ ఆరు బెర్తుల్లో ఎవరిని తీసుకుంటారనే దానిపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.
కేబినెట్ ఖాళీగా ఉన్న 6 బెర్తుల కోసం దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అధికంగా ముగ్గురికి అవకాశం లభించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి సీఎంగా రేవంత్‌రెడ్డి ఉంటే.. మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఉమ్మడి నల్లగొండ నుంచి ఇద్దరు, ఉమ్మడి కరీంనగర్ నుంచి ఇద్దరు, ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. మెదక్ నుంచి అయితే దామోదర రాజనర్సింహకు కేబినెట్‌లో చోటు దక్కింది. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులకు నాలుగు జిల్లాల వారినే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి నుంచి మంత్రులను ఎంపిన చేసే చాన్స్ ఉంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను.. కాంగ్రెస్ 4 స్థానాలనే కైవసం చేసుకుంది. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ను అసెంబ్లీ స్పీకర్‌గా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్‌మోహన్‌రెడ్డి ఇద్దరు మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తుండగా.. ఇద్దరిలో ఒకరికి మంత్రిపదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 అసెంబ్లీ స్థానాలకు గాను.. కాంగ్రెస్ నాలుగింట్లో గెలిచింది. ఈ జిల్లా నుంచి ముగ్గురు సీనియర్ లీడర్ల పేర్లు మంత్రి పదవుల కోసం వినిపిస్తున్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు మంత్రి పదవి దక్కించుకునే వారి రేసులో ఉన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. మదన్‌మోహన్ రావుకి ఐటీ శాఖను ఇస్తే బావుంటుందని కొద్దిరోజల నుంచి నెట్టింట చర్చ జరుగుతోంది. పార్టీ నేతలు కూడా అదే భావిస్తున్నారు. మరోవైపు ఇదే జిల్లాకు చెందిన షబ్బీర్ అలీ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో ఉన్నారు. నిజాఆబాద్ అర్బన్ నుంచి పోటీ చేసిన షబ్బీర్ అలీ గెలవలేదు కానీ..ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మైనార్టీ కోటాలో కేబినెట్‌లో చాన్స్ ఇవ్వాలని పార్టీని కోరుతున్నట్లు సమాచారం. కామారెడ్డి అసెంబ్లీ స్థానాన్ని రేవంత్ రెడ్డి కోసం షబ్బీర్ వదులుకున్నటువంటి అంశాలు ఆయనకు కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్ జిల్లాలో అయితే 15 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలేదు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కావడంతో.. ఇక్కడి నుంచి కనీసం ఒక్కరైనా మంత్రివర్గంలో ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీని కోసం ఫిరోజ్‌ఖాన్, అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కి గౌడ్, మైనంపల్లి హన్మంతరావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో బీసీలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన మరొకరికి అవకాశం లభించే అవకాశం ఉంది. ఈ కోటాలో అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కి గౌడ్‌కు అవకాశం లభించే అవకాశం ఉంది.