తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ కేబినెట్ భేటీలో మహిళా సాధికారత అంశాలే ప్రధానంగా ఉండనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహిళలకు నెలకు రూ.2,500పై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో లోక్‌సభ ఎన్నికలు వస్తుండటంతో మహిళల ఓట్లను ఆకర్షించుకునేందుకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడ్డా.. ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది.
అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పునరుద్ధరణ, రూ.5 లక్షల జీవిత బీమా, కొత్త రేషన్ కార్డులు, తదితర అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ అలవెన్స్ ప్రకటనపై మంత్రివర్గం చర్చించనుందని సమాచారం. సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే 'మహిళా శక్తి' సభలో వీటిపై ప్రకటన చేయనున్నట్టు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్రమంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.