Telangana: 'సన్న వడ్లకే క్వింటాల్‌కు రూ.500 బోనస్'.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటీ ముగిసింది. సచివాలయంలో దాదాపు 4 గంటల పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
By అంజి Published on 20 May 2024 3:36 PM GMTTelangana: కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటీ ముగిసింది. సచివాలయంలో దాదాపు 4 గంటల పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, పథకాల అమలు సహా పలు కీలక అంశాలపై సమాలోచలు చేశారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న ఘనంగా నిర్వహించాలని కేబినెట్ మీటింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించింది. ధాన్యం కొనుగోళ్ల బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించింది. రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకూ కొనాలని ఆదేశించింది.
గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ ఇంత వేగంగా ధాన్యం సేకరణ జరగలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తూకం పూర్తైన ఐదు రోజుల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు, విద్యార్థులకు అవసరమైన 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని రాష్ట్రంలోనే సేకరిస్తున్నామన్నారు. అందుకే సన్న వడ్లకే క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్టు వెల్లడించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను ఆధునీకరించాలని నిర్ణయించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పాఠశాల ఆధునీకరణకు సుమారు రూ.600 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై తన అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కాళేశ్వరం మరమ్మతులపై కూడా మంత్రి వర్గంలో చర్చించామన్నారు. మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించామని అన్నారు.
కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాత్కాలికంగా నీటిని లిఫ్ట్ చేసే విధంగా ఏదైనా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. అది కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల సూచనల మేరకే చర్యలు ఉంటాయని స్ఫష్టం చేశారు.
రాష్ట్రంలో వానకాలం సీజన్ వస్తోందని.. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నికలీ విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రైతులెవరూ నకిలీ ఎరువులు కొని మోసపోవద్దని సూచించారు. త్వరలో స్కూళ్లు కూడా ఓపెన్ కాబోతున్నాయని వాటి కోసం ముందస్తుగానే రూ.120 కోట్లు కేటాయించామన్నారు.