ప్రయాణీకులకు షాక్.. టికెట్ చార్జీలను పెంచిన ఆర్టీసీ.. నేటి నుంచే అమల్లోకి
Telangana Bus Fares Go Up as TSRTC Imposes Diesel Cess.ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంలా తయారైంది
By తోట వంశీ కుమార్ Published on 9 April 2022 9:32 AM ISTముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంలా తయారైంది సామాన్యుడి పరిస్థితి. ఓ వైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగుతుండడంతో వాహనాలను బయటకు తీయలేని పరిస్థితి నెలకొనగా.. కనీసం ప్రజా రవాణాలో ప్రయాణం చేద్దామని బావిస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) ప్రయాణీకులకు షాకిచ్చింది. ప్రయాణీకుల నుంచి డీజిల్ సెస్ వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో బస్సుల్లో టికెట్ చార్జీలు మరింత భారం కానున్నాయి.
అసలే నష్టాల్లో ఉన్న సంస్థపై బల్క్ డీజిల్ ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2021 డిసెంబర్‌లో బల్క్‌లో లీటర్ డీజిల్ ధర రూ.83 ఉండగా.. తాజాగా అది 118కి చేరింది. దీంతో పల్లెవెలుగు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ దూరంతో సంబంధం లేకుండా టికెట్‌పై రూ.2 చొప్పున, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో టికెట్‌పై రూ. 5 చొప్పున పెంచుతున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
ఇక తక్కువ దూరం ప్రయాణించేవారిపై భారం పడకుండా.. కనీస టికెట్ ధరను పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో స్థిరంగా(రూ.10) ఉంచుతామన్నారు. పెరిగిన ధరలు నేటీ(శనివారం) నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు రోజు వారిగా డీజిల్ ధరలు పెరుగుతున్నా సంస్థే భారం మోస్తూ వచ్చింది. తాజా నిర్ణయం ఆర్టీసీకి కొంత మేర ఉపశమనం కలిగిస్తుంది. అనివార్య పరిస్థితుల్లో సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, వీసీ సజ్జనార్ లు కోరారు.
ఇదిలాఉంటే.. ఇటీవలే టోల్ ఛార్జీల వ్యత్యాసం పేరుతో సంస్థ టికెట్‌పై రూపాయి పెంచగా.. ఆ వెంటనే రౌండ్ ఆఫ్ పేరిట రెండు నుంచి ఐదు రూపాయల వరకు భారం మోపింది. దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో టికెట్ ధర తగ్గగా.. మరికొన్ని ప్రాంతాల్లో పెరిగింది. తాజాగా డీజిల్ సెస్ విధించింది.