ఇవాళ్టి నుండే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Budget Session starts today. ఇవాళ్టి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమో
By అంజి Published on 7 March 2022 9:14 AM IST
ఇవాళ్టి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు జరగుతాయి. ఈ సమావేశాలు గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన సమావేశాలను కొనసాగింపుగా జరుగుతాయి. దీంతో ఈ సంవత్సరం మొదటి సమావేశాలుగా పరిగణించబడనందున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం మండిపడింది. ఇవాళ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శాసనసభ, మండలి సమావేశం అవుతాయి. 10 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయని సమాచారం. మొదటగా ఆర్థికమంత్రి హారీష్ రావు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు.
శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన కాసేపటికి ఉభయసభలు వాయిదా పడతాయి. అనంతరం బీసీఏ సమావేశంలో బడ్జెట్ సమావేశాల ఎజెండాను నిర్ణయిస్తారు. అయితే ఈ సారి బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో బడ్జెట్ సమావేశాలు కాస్తా వాడివేడిగా జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే విపక్షాలు ప్రభుత్వంపై మాటల దాడికి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు దూకుడుగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ నియామకాలు, కేంద్ర నుంచి నిధులు, విభజన చట్టం హామీలు, నదీ జలాలు, ధాన్యం సేకరణ వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.