కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ అన్నదాతలను ఆగం చేసేలా ఉంది: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌పై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు.
By Srikanth Gundamalla Published on 10 Feb 2024 4:05 PM ISTకాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ అన్నదాతలను ఆగం చేసేలా ఉంది: హరీశ్‌రావు
తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,75,891 కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌పై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌పై విమర్శలు చేశారు.
గ్యారెంటీల అమలు విషయంలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ ఒక స్పష్టత ఇవ్వలేకపోయిందని హరీశ్‌రావు అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతును రాజు చేసేందుకు కృషి చేసిందని చెప్పారు. కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్నదాతలను ఆగం చేసేలా బడ్జెట్‌ను తీసుకొచ్చిందని విమర్శలు చేశారు మాజీమంత్రి హరీశ్‌రావు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు.. బడ్జెట్‌లో కేటాయింపులకు సంబంధం లేదని అన్నారు. రైతులకు బడ్జెట్‌లో నామమాత్రంగా కేటాయించి.. వారి నోట్లో మట్టి కొట్టేలా చేశారని అన్నారు. రైతుబంధుకి రామ్‌రామ్ పలికేటట్లు, పంటల బోనస్ భోగస్ అన్నట్లు.. రుణమాఫీకి మొండి చేయి చూపేటట్లు బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయని హరీశ్‌రావు అన్నారు. రూ.19,746 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించామని చెప్పారనీ.. కానీ ఇందులో ఎస్టాబ్లిష్‌మెంట్ మాత్రమే 3వేల కోట్ల రూపాయలు పోతాయని చెప్పారు. మిగిలిన అమౌంట్‌లో వ్యవసాయరంగం మొత్తానికి ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. మొత్తంగా బడ్జెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి మొండి చేయిచూపించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో అబద్దాలు చెప్పి.. అలాగే అసెంబ్లీలోనూ అబద్ధాలే మాట్లాడుతోందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు.
ఇక బడ్జెట్‌పై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ నిరాశజనకంగా ఉందని చెప్పారు. సికింద్రాబాద్‌లో జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ. లక్షా 25వేల కోట్లు అవసరం పడతాయనీ.. కానీ వాటి కోసం రూ.53వేల కోట్లు మాత్రమే కేటాయించారని కేటీఆర్ అన్నారు. ఇక ప్రతి మీటరుకి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణ జల హక్కులను కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండలో సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.