కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు..ప్రతీకార పాలన: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

వనపర్తి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి హత్యపై ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  23 May 2024 10:51 AM GMT
telangana, brs, rs praveen kumar,  congress govt,

కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు..ప్రతీకార పాలన: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

వనపర్తి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి హత్యపై ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు అండతోనే కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారని అన్నారు. దాడులకు బెదిరేది లేదనీ.. మాఫియాలను రాజ్యాంగబద్ధంగా కుప్పకూల్చే దాకా నిద్రపోనివ్వం అని వార్నింగ్‌ ఇచ్చారు. ఇక సీఎం, మంత్రి అండతోనే బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. ప్రాణాలకు పెను ప్రమాదం ఉందని డీజీపీకి శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే ఆయన హత్యకు గురయ్యారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.

శ్రీధర్‌రెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్. తెలంగాణలో ప్రతిపక్షామే లేకుండా చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అందుకే రాజకీయ హత్యలకు తెరలేపిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదనీ.. ప్రతీకార పాలన సాగిస్తోందని ఫైర్ అయ్యారు. మంత్రి అండదండలతో యథేచ్చగా జరుగుతోన్న దాడుల్లో అధికార పార్టీకి చెందిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైల్లో పెట్టాలన్నారు. అధికాపార్టీకి తొత్తులుగా మారిన కొందరు స్థానిక అధికారులను బర్తరఫ్‌ చేయాలని.. వారిపై ఎంక్వైరీ వేసి శిక్షించాలని ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ డిమాండ్ చేశారు.

కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో వెంటనే కేంద్ర బలగాలు, స్పెషల్ పోలీసు బలగాలతో పికెట్లను ఏర్పాటు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రాణానికి ముప్పు ఉందని బీఆర్ఎస్‌, ఇతర ప్రతిపక్ష నేతలు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వారికి భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువవుతున్నాయని అన్నారు. వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Next Story