బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఖాకీ దుస్తులు ధరించి ఆటోల్లో అసెంబ్లీకి వెళ్లారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో 90కుపైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆరోపించారు. కేటీఆర్ స్వయంగా ఆటో నడిపారు. నిన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రైతులకు మద్ధతు తెలుపుతూ నల్ల చొక్కాలు ధరించి సభకు వెళ్లిన విషయం తెలిసిందే.
హామీ మేరకు ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా నిలవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దని, బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు. అటు శాసనసభలో బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం ప్రతిపాదించింది.
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వివేకానందుకు నిబంధనలపై అవగాహన ఉందని, ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని, స్పీకర్‌కు ముందుగానే సమాచారం ఇవ్వాలని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఆటో డ్రైవర్లకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఆటో రిక్షాల పన్నులు పెంచారని, కొత్త వాటికి అనుమతులు ఇవ్వలేదని విమర్శించారు.