మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల గెలుస్తారు: మల్లారెడ్డి సంచలన కామెంట్స్

బీఆర్ఎస్‌ మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  26 April 2024 5:47 PM IST
telangana, brs, malla reddy,  etela, viral comments,

మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల గెలుస్తారు: మల్లారెడ్డి సంచలన కామెంట్స్ 

బీఆర్ఎస్‌ మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి మల్లారెడ్డి వైరల్‌ కామెంట్స్ చేశారు. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మల్కాజ్‌గిరిలో శుక్రవారం ఓ పెళ్లి కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కూడా హాజరు అయ్యారు. ఇంతకు ముందు వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీలోనే కలిసి పనిచేశారు. దాంతో.. ఇద్దరు నాయకులు ఎదురుపడగానే కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఆప్యాయంగా ఒకరితో మరొకరు ఫొటో దిగారు. అడిగి మరీ ఈటలతో మల్లారెడ్డి ఫోటో తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈసారి మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్‌ అన్నా.. అంటూ ఈటలతో మల్లారెడ్డి మాట్లాడారు. మల్కాజిగిరిలో ఇంకెవరు గెలుస్తారు.. నువ్వే గెలుస్తున్నావ్.. అంటూ ఈటలను మల్లారెడ్డి హత్తుకున్నారు.

మల్లారెడ్డి చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు షాక్‌కు గురవుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక సీట్ల కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంటే.. మల్లారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని అంటున్నారు. ప్రస్తుతం ఈ పరిణామం చర్చనీయాంశం అవుతోంది.


Next Story