ఒకటో తారీఖు జీతాలు ఇస్తామన్న హామీ ఏమైంది: హరీశ్‌రావు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ నాయకులు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

By Srikanth Gundamalla  Published on  22 Feb 2024 1:14 PM IST
telangana, brs, harish rao,  congress govt,  salaries,

 ఒకటో తారీఖు జీతాలు ఇస్తామన్న హామీ ఏమైంది: హరీశ్‌రావు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ నాయకులు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్‌ కూడా గత బీఆర్ఎస్‌ పాలనలో చేసిన తప్పులను ఎత్తిచూపుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిందనీ.. కానీ ఇంకా అమలు చేయడం లేదని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్‌ వర్సెస్ కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు వారు హామీలను అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇక తాజాగా మాజీమంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు చేశారు. ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టిన మాజీమంత్రి హరీశ్‌రావు.. కాంగ్రెస్‌ హామీలను గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే.. ప్రతీ నెలా ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చిందని గుర్తు చేశారు. అలా ప్రచారం జరిపే అధికారంలోకి వచ్చారు అని అన్నారు. కానీ.. ఇప్పటి వరకు ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదా అని నిలదీశారు హరీశ్‌రావు. 22 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అంగన్‌వాడీలకు జీతాలు అందలేదనీ.. దాంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్‌రావు చెప్పారు. నెలంతా పని చేసి జీతం కోసం మరో నెలపాటు ఎదురుచూడాల్సి వస్తోందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బంది జీతాలను చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.


Next Story