Telangana: పార్లమెంట్‌ ఎన్నికలకు బీజేపీ ఇంచార్జ్‌ల నియామకం

తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇంచార్జ్‌లను నియమించింది బీజేపీ అధిష్టానం.

By Srikanth Gundamalla
Published on : 8 Jan 2024 4:21 PM IST

telangana, bjp, parliament election, in charges,

Telangana: పార్లమెంట్‌ ఎన్నికలకు బీజేపీ ఇంచార్జ్‌ల నియామకం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న ఫలితాలు రాలేదు. కానీ.. గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఈసారి సీట్లు పెరిగాయి. అలాగే ఓటింగ్ శాతంగా కూడా బాగానే మెరుగుపడింది. దాంతో.. మరోసారి ఇప్పుడు బీజేపీ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ఎలాగైనా లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లోనే గెలిచిన విషయం తెలిసిందే. పార్టీని పటిష్టం చేసే పనులపై కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇంచార్జ్‌లను నియమించింది అధిష్టానం. పార్టీ కేడర్‌ను సమన్వయ పరుచుకుంటూ.. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సాగాలని ఇంచార్జ్‌లకు సూచనలు చేసింది బీజేపీ.

తెలంగాణ బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి బండి సంజయ్, సోయం బాపూరావు, అర్వింద్, కిషన్‌రెడ్డి ఎంపీలుగా ఉన్నారు. వీరెవరికీ నియోజకవర్గ ఇంచార్జుల బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్‌ నేతలకు నియోజకవర్గ బాధ్యతలను బీజేపీ అధిష్టానం అప్పగించింది.

పార్లమెంట్‌ నియోజకవర్గాల బీజేపీ ఇంచార్జులు: కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం ఇంచార్జ్‌గా ధన్‌పాల్‌ సూర్యానారాయణ గుప్త, ఆదిలాబాద్‌ ఇంచార్జ్‌గా పాయల్‌ శంకర్, పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌గా రామారావు, నాగర్‌కర్నూలు ఇంచార్జ్‌గా రంగారెడ్డి, నల్లగొండ పార్లమెంట్‌ ఇంచార్జ్‌గా చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఎన్వీఎస్‌ ప్రభాకర్, వరంగల్ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌గా మర్రి శశిధర్‌రెడ్డి, మహబూబాబాద్ ఇంచార్జ్‌గా గరికపాటి మోహన్‌రావు, ఖమ్మం నియోజకవర్గ ఇంచార్జ్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా రాకేశ్‌రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్‌గా లక్ష్మణ్, జహీరాబాద్‌కు వెంకటరమణారెడ్డి, మెదక్‌ ఇంచార్జ్‌గా హరీశ్‌బాబు, హైదరాబాద్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌గా రాజాసింగ్, చేవెళ్ల ఇంచార్జ్‌గా వెంకటనారాయణరెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఆలేటి మహేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా రామంచర్‌రావును బీజేపీ అధిష్టానం నియమించింది.


Next Story