తెలంగాణలో ఇక ఫలితాలన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకమే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  18 May 2024 3:50 PM IST
telangana, bjp, kishan reddy,  congress govt,

తెలంగాణలో ఇక ఫలితాలన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకమే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డి లేదని మండిపడ్డారు. ఎన్నికల వేళ నోటికి వచ్చిన హామీలను ఇచ్చారు కానీ.. అమలు చేసే వీలుంటుందా అని ఆలోచించలేదు అన్నారు. అయితే.. ప్రజలు అధికారం ఇచ్చినా.. వాటిని అమలు చేయలేని పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్‌కు ఇచ్చిన హామీలను మర్చిపోవడం అలవాటే అంటూ విమర్శలు చేశారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్‌ను కూడా ప్రజలు నమ్మడం లేదన్నారు. బీజేపీకి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఇక నుంచి ఏ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఉంటాయని జోస్యం చెప్పారు. ఈ కొద్ది నెలల పాలనతోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి చెందారని కిషన్‌రెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్‌లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీలో ఉండటం లేదన్నారు. వరుసగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. తెలంగాణలో భవిష్యత్‌ ఉన్న పార్టీ ఇక బీజేపీనే కాబోతుందని కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని కిషన్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్‌ కుటుంబ పాలను ప్రజలు అసహ్యించుకున్నారనీ.. మరోసారి వారిని ప్రజలు నమ్మబోరు అని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

Next Story