ఫిబ్రవరి మొత్తం పార్టీలో చేరికలకు కేటాయించాలి: కిషన్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  2 Feb 2024 2:41 PM IST
telangana, bjp, kishan reddy, comments,  congress govt,

ఫిబ్రవరి మొత్తం పార్టీలో చేరికలకు కేటాయించాలి: కిషన్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఫిబ్రవరి 1న గ్రూప్‌-1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఫిబ్రవరి నెల ఇదే అని గ్రూప్-1 నోటిఫికేషన్ ఏమైందని ప్రభుత్వాన్ని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు బీజేపీ యాత్రలు, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల సమ్మేళనంతో పాటు పలు అంశాలపై చర్చించారు. అలాగే పోలింగ్‌ బూత్‌ స్థాయిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన లోపాలను సరి చేసకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు.

తెలంగాణలో వేగంగా రాజకీయ సమీకరణాలు మారనున్నాయని కిషన్‌ రెడ్డి అన్నారు. గ్రామ స్థాయిలో నిత్యం కొత్తగా చేరికలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. చేరికలు అంటే ఇతర పార్టీల నుంచి మాత్రమే కాదనీ.. సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారినీ పార్టీలో చేర్చుకోవాలని అన్నారు. ఫిబ్రవరి నెల మొత్తాన్ని పార్టీలో చేరికల కోసం కేటాయించాలన్నారు కిషన్‌రెడ్డి. మండలం, అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థాయిలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని కిషన్‌రెడ్డి చెప్పారు.

ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో చరిత్ర ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ యువతను కాంగ్రెస్ మరోసారి మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఎన్నికల వాగ్దానంలో ఫిబ్రవరి 1న తెలంగాణ నిరుద్యోగ యువత కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారనీ.. గొప్పగా వార్తా పత్రికల్లో కూడా ప్రింటింగ్‌ చేయించుకున్నారని విమర్శించారు. ఒకటో తేదీ వెళ్లిపోయిందనే విషయం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలియడం లేదా అన్నారు. హామీలు ఇవ్వడం వాటిని నెరవేర్చకోవడం కాంగ్రెస్‌కే చెల్లుతుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపడిందని అన్నారు. ఇతర వాగ్దానాలను కూడా దాటవేసే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Next Story