ఎక్కడికో ఎందుకు? తెలంగాణలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవిగో..
తెలంగాణలోనూ మంచి టూరిస్ట్ ప్లేస్‌లు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం చాలా ప్రాంతాలను
By Srikanth Gundamalla Published on 20 Jun 2023 12:31 PM GMTఎక్కడికో ఎందుకు? తెలంగాణలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవిగో..
తెలంగాణలో చాలా మంది పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే వెంటనే ఏ స్టేట్ వెళ్తే బాగుంటుందని సెర్చ్ చేస్తారు. కానీ తెలంగాణలోనూ మంచి టూరిస్ట్ ప్లేస్‌లు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం చాలా ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తోంది. ప్రకృతి సహజసిద్ధంగా జాలువారే జలపాతాలు, అద్భుత నిర్మాణం కాళేశ్వరం జలాశయాలు.. విహార కేంద్రాలు ఇలా చాలానే ఉన్నాయి. వాటిని విజిట్ చేసి ఎంతో ఆనందపడుతున్నారు పర్యాటకులు. మరి తెలంగాణలో ఉన్న మైమరిపించే ఆ పర్యాటక కేంద్రాలు ఏవి..? ఎక్కడున్నాయో మనమూ ఓసారి చూద్దాం.
యాదాద్రి టెంపుల్:
తెలంగాణలో అద్భుత పునర్‌నిర్మాణం యాదగిరి గుట్ట. తెలంగాణ ఇంటి దైవంగా లక్ష్మీనరసింహస్వామిని కొలుస్తారు. ఆ స్వామి కొలువుదీరిన ప్రాంతమే యాదగిరిగుట్ట. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పునర్‌నిర్మాణం చేసింది. ఎప్పుడు నిత్యం భక్తులతో రద్దీతో ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. పునర్‌నిర్మాణం తర్వాత ఇల వైకుంఠంగా అలరారుతున్న గుట్టకు భక్తజనం పోటెత్తుతున్నారు. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండటంతో వీకెండ్స్ అయితే చాలు రద్దీ మరింత ఎక్కువ అవుతోంది.
రామప్ప ఆలయం:
ఓరుగల్లు జిల్లాలోని రామప్ప ఆలయం ఈ మధ్యకాలంలోనే యునెస్కో గుర్తింపు పొందింది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా మారింది. కాకతీయ వైభవాన్ని చాటిచెప్పే నృత్య శిల్పాలు, మదనిక రూపాలు, సాలభంజికలు పర్యాటకులు చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి.
రాజన్న దేవస్థానం:
కోడె మొక్కుల రాజన్నను చాలా మంది ఇష్ట దైవంగా కొలుస్తారు. ఏ సమస్యలున్నా రాజన్న చెంతకు వెళ్లి ఒక్కసారి మొక్కుకుంటే వెంటనే తీరుతుంది భక్తులు విశ్వసిస్తారు. గొప్ప ఆలయంగా విరాజిల్లుతోంది.
పాండవుల గుట్ట:
ప్రకృతి మలిచిన శిల్పాలను చూడాలంటే పాండవుల గుట్టకు వెళ్లాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపాల్లె దగ్గర ఉంది పాండవుల గుట్ట. పొరలు పొరలుగా పేర్చిన శిలలు వింత ఆకృతుల్లో చూపరులను అబ్బురపరుస్తాయి. ప్రకృతి శిల్పాలను చూడటానికి చాలా మంది ఇక్కడికి వెళ్తుంటారు.
మన నయాగారా:
చాలా మంది పర్యాటకులు జలపాతాలు అంటే ఇష్టపడతారు. వాటికింద జలకాలాటలు ఆడుతూ మైమరిచిపోతుంటారు. తెలంగాణలోని వనసీమల్లో అలాంటి జలపాతాలు చాలా ఉన్నాయి. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ముఖ్యంగా ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి దగ్గరున్న బోగత జలపాతం అయితే అందరినీ ఆకట్టుకుంటోంది. 50 అడుగుల ఎత్తు నుంచి పాల నురగలతో, నయాగార సోయగాలతో నీళ్లు కిందకు దూకుతున్నాయి. ఈ దృశ్యాలను చూసేందుకు తెలంగాణ ప్రజలే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా టూరిస్ట్‌లు వస్తున్నారు.
లక్నవరం సరస్సు:
ములుగు జిల్లాలోని మరో అద్భుత పర్యాటక కేంద్రం లక్నవరం సరస్సు, సముద్రాన్ని తలపించే ఈ భారీ సరస్సు మూడు తీగల వంతెనలతో సందర్శకులకు ఇష్టమైన ప్రదేశంగా మారుతోంది. వారంతాల్లో జనాలు చలో లక్నవరం అంటూ ఇక్కడికి వచ్చి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
మన్ననూరు:
నల్లమల అడవి సౌందర్యాన్ని చూడాలంటే మన్ననూరుకి మించిన ప్రదేశం మరోకటి లేదు. ఇది శ్రీశైలానికి వెళ్లే దారిలో ఉంటుంది. పచ్చటి అడవికి కేరాఫ్‌గా ఈ ప్రదేశాన్ని చెబుతారు. ఫరహాబాద్ వ్యూ పాయింట్ నుంచి కృష్ణానది సోయగాలు అద్భుతంగా కనిపిస్తాయి. మల్లెలతీర్థం, ఉమామహేశ్వరం కూడా మన్ననూరుకి చాలా దగ్గరే
రాజధాని:
తెలంగాణ రాజధాని హైదరాబాద్. ఇక్కడ చూడటానికి చాలా టూరిస్ట్ ప్లేస్‌లు ఉన్నాయి. పర్యాటకులకు స్వర్గధామం. ఇక్కడ చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం కూడా కొన్ని అద్భుత నిర్మాణాలను చేసింది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరాన కొత్తగా నిర్మించిన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ఇలా చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. రోజుకో పర్యాటక ప్రాంతం హైదరాబాద్ మ్యాప్‌లో చేరుతోంది.