తెలంగాణ వ్యాప్తంగా.. 2వ దశ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

Telangana begins 2nd phase of free eye screening programme. హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద కంటివెలుగు కార్యక్రమంగా పేర్కొంటున్న కంటి

By అంజి  Published on  19 Jan 2023 9:39 AM GMT
తెలంగాణ వ్యాప్తంగా.. 2వ దశ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద కంటివెలుగు కార్యక్రమంగా పేర్కొంటున్న కంటి వెలుగు రెండో దశ తెలంగాణ వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సామూహిక కంటి పరీక్షా శిబిరాలను ప్రారంభించారు. 1.5 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసేందుకు వచ్చే 100 రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో క్యాంపులు నిర్వహించనున్నారు. లబ్ధిదారులకు ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు.

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి టి.శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి వైద్యఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రారంభించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. కొంతమంది లబ్ధిదారులతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. అంధత్వ రహిత తెలంగాణ సాధించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. కంటి వెలుగు దేశానికి మరో రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో కంటి వెలుగును ప్రారంభించేందుకు ముందుకు రావడం తెలంగాణకు గర్వకారణమని హరీశ్ రావు అన్నారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుధవారం ఖమ్మంలో కొత్తగా ప్రారంభించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో రెండవ దశ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌లతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఇతర జాతీయ నాయకులు కూడా హాజరయ్యారు.

అనంతరం ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఆవిర్భావ బహిరంగ సభలో ప్రసంగిస్తూ కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనియాడుతూ తమ తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని ప్రకటించారు. కంటి వెలుగు శిబిరాలు వచ్చే 100 రోజుల పాటు వారానికి ఐదు రోజులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి. శిబిరాల నిర్వహణకు మొత్తం 1,500 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. దాదాపు 1.5 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి 55 లక్షల మందికి కళ్లద్దాలు, మందులు పంపిణీ చేయనున్నారు.

2018లో కంటి వెలుగు మొదటి రౌండ్‌లో రాష్ట్రం సృష్టించిన రికార్డును ఈ రౌండ్‌లో మరిన్ని కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి బద్దలు కొట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్‌లను కోరారు.

Next Story