Telangana Govt Hospitals: ఆస్పత్రి వార్డుల్లో ఆహారం తినడంపై నిషేధం

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రతను మెరుగుపర్చడమే లక్ష్యంగా, అలాగే ఎలుకలు, కీటకాల సమస్య నివారణకు ఆస్పత్రి వార్డుల్లో...

By -  అంజి
Published on : 22 Dec 2025 8:20 AM IST

Telangana, Ban, eating food, government hospital wards,Medical Health Department

Telangana Govt Hospitals: ఆస్పత్రి వార్డుల్లో ఆహారం తినడంపై నిషేధం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రతను మెరుగుపర్చడమే లక్ష్యంగా, అలాగే ఎలుకలు, కీటకాల సమస్య నివారణకు ఆస్పత్రి వార్డుల్లో రోగుల సహాయకులు భోజనం చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిషేధం విధించింది. క్యాంటీన్లలోనే ఆహారం తినేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరింది. వార్డులో ఆహారం తిని పారవేయడంతో ఎలుకల బెడద పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఆస్పత్రులను పరిశుభ్రం ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

ఆస్పత్రుల్లో రోగులతో ఉండే సహాయకులు.. రోగులకు చికిత్స అందించే వార్డుల్లో ఆహారం తినడంపై ఆరోగ్యశాఖ పూర్తి నిషేధం విధించింది. క్యాంటీన్లలో మాత్రమే అటెండర్లు భోజనాలు చేసేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆదివారం ప్రకటించింది. ఆస్పత్రుల్లో ఎలుకల సమస్యలు తలెత్తడంపై వైద్య ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

రోగుల సహాయకులు వార్డుల్లో ఆహారం తినడం, మిగిలిన పదార్థాలను అక్కడే నిర్లక్ష్యంగా పారవేయడం వల్లే ఎలుకల బెడద పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే వార్డుల్లో ఆహార వినియోగంపై పూర్తి నిషేధం విధించింది.

''రోగులకు పూర్తి సురక్షితమైన, ఆరోగ్యకరమైన ‘హీలింగ్‌ జోన్‌’లుగా ఆస్పత్రులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది'' అని తెలంగాణ వైద్య విద్యా డైరెక్టర్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. ''ఆస్పత్రుల్లో చెదల నియంత్రణ కోసం ‘ఇంటిగ్రేటెడ్‌ హాస్పిటల్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాం. ఎలుకల రాకుండా ఉండేందుకు ఆస్పత్రి భవనాల్లోని పగుళ్లు, రంధ్రాలను సిమెంట్‌, ఇతర దృఢమైన పదార్థాలతో శాశ్వతంగా మూసివేస్తున్నాము. ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూలు, లేబర్‌ రూమ్‌ల్లో ‘‘జీరో-గ్యాప్‌’’ సీలింగ్‌ విధానాన్ని పాటిస్తూ పూర్తి స్టెరిలైజేషన్‌ నిర్వహిస్తున్నాము. కిటికీలు, వెంటిలేటర్లు, డ్రైనేజీ పైపులు, డక్ట్‌లకు బలమైన వైర్‌ మెష్‌లు ఏర్పాటు చేస్తున్నాము'' అని నరేంద్ర కుమార్‌ వెల్లడించారు.

Next Story