నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly sessions starts from Today.తెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 24 Sep 2021 4:08 AM GMTతెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశం కానున్నాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపం తెలియజేయనున్నారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. ఉభయ సభల సమావేశాల అజెండా నేడు ఖరారు కానున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ, మండలిలో చర్చించే అశాలు, ఎన్నిరోజులు పనిచేయాలనే అంశాలను నిర్ణయించనున్నారు. కాగా.. ఈ సారి అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం బావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సమావేశాల్లో ఐదుకు పైగా బిల్లులను ఆమోదింప జేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇందులో దళిత బంధుకు సంబంధించిన పథకం కూడా ఉందని తెలుస్తోంది. మరోపక్క ప్రతిపక్షాలు కూడా నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీల గురించి నిలదీయడానికి సన్నద్దమవుతున్నాయి. ఆసరా పెన్షన్స్ పంపిణీలో జాప్యంపై గళమెత్తాలని బీజేపీ నిర్ణయించింది. దళిత బంధు పథకం అమలు తీరు, నిరుద్యోగ భృతితో పాటు ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటోంది.
ఉప్పుడు బియ్యం కొనుగోలు కేంద్రప్రభుత్వం నిరాకరించడం, ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కేంద్ర వైఖరీ, కృష్ణా, గోదావరి బోర్డులపై నోటిఫికేషన్ జారీ వంటి వాటిపైనా చర్చ జరగనుంది. శాంతిభద్రతలు, మహిళలు-చిన్నారులపై దాడులు, డ్రగ్స్ వంటి అంశాలపైనా చర్చించే వీలుంది.